మనఊరు మనచెట్టు: ఇంటిని నందనవనంగా మార్చే పూల మొక్కలు

Tuesday, June 14, 2016

ఇంటిని నందనవనంగా మార్చే పూల మొక్కలు





బంతి పూలు చేమంతిపూలు, జాజి పూలు ముఖ్యంగా పారిజాత పుష్పాలు ఇవి ఉన్న ఇల్లు నిజంగా నందనవనమే మరి. ఆయా సీజన్లలో ఇంటికి శోభనిచ్చే పూల మొక్కలను పెంచుకునే వీలుంటే ఆలస్యం చేయకుండా మీ ఇంటిని పూల కుండీల, తీవెల మయం చేయండి మరి. బంతి చేమంతి పూలు వర్షాకాలంలో నాటడానికి అనువైన మొక్కలు జూన్ జూలై మాసాల్లో వర్షాకాలం మొదలైనప్పుడు ఈ మొక్కలను నాటితే ఆగస్టు సెప్టెంబర్ నాటికి పూలు పూసి ఇంటికి శోభనిస్తాయి. నారు మళ్లు లేదా కొద్దిగా ఎత్తైన మురుగు నీటి సౌకర్యమున్న ప్రదేశంలో విత్తనాలను విత్తండి.
విత్తనం మొలకెత్తేందుకు...విత్తనాలు వేశాక దానిపై ఎక్కువ మట్టిని కప్పకూడదు. విత్తనం పరిమాణానికి మూడు నాలుగింతల వరకే ఈ మట్టి ఉండాలి. అంతకు మించితే లోతు ఎక్కువై విత్తనాలు మొలకెత్తడం కష్టమైపోతుంది. నీరు ఎక్కువైతే మొలిచిన నారు కుళ్లిపోయే అవకాశముంది. తక్కువైతే ఎండిపోవచ్చు. అందుకే విత్తనాలు విత్తిన తర్వాత కనీసం మూడు వారలపాటయినా అవసరమైన మేరకే నీటిని పెట్టేలా జాగ్రత్త పడాలి. నీరు మరీ ఎక్కువైనా లేదా మరీ తక్కువైనా ఇబ్బందే అని గుర్తెరగండి.విత్తనం మొలకెత్తి నాలుగైదు ఆకులు రాగానే మొక్కను కుండీలు, ఫ్లవర్ బెడ్‌లలో నాటుకోవచ్చు. నాటడానికి ముందు కుండీలో మట్టి వదులుగా ఉండేలా చూసుకోవాలి. మొక్కలు నాటాక నీటిని మోతాదుగా పోస్తూరావడం మర్చిపోవద్దు. నర్సరీలో దొరికే చేమంతి నారు లేదా పిలకలను నాటిదే ఏపుగా పెరిగే అవకాశముంది. మొక్కకు అన్ని వైపులా ఎరువులు వేసేలా జాగ్రత్త వహించాలి. అయితే లేత చిగుర్లకు ఎరువు తగలకుండా చూడాలి. ఎందుకంటే ఎరువుల ప్రభావానికి చిగుర్లు మాడిపోయే ప్రమాదముంది. పాలిపోయిన, ఎండిపోయిన పూలను ఎప్పటి కప్పుడు కత్తిరించాలి. ఇలా చేయడం వల్ల మొక్కలు తాజాగా కనిపిస్తాయి. ఎక్కువకాలం పాటు పూలనిస్తాయి. చేమంతి బంతి వంటి మొక్కలకు ప్రతి మూడు కణుపుల కొకసారి చిగుర్లు తుంచడం వల్ల కొమ్మలు పెరిగి ఎక్కువ పూలనిస్తాయి.మొక్కలు అందంగా ఆరోగ్యంగా, పురుగులు, తెగుళ్లు పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలియ ఎప్పటి కప్పుడు కలుపు మొక్కలు, ఎండిన ఆకులను తీసేస్తూ మొక్కను పరిశుభ్రంగా ఉంచితే పురుగుల బెడద అంతగా ఉండదు.వేపనూనె లేదా వేప పిండి కలిపిన లీటరు నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున వారానికి ఓ సారి పిచికారి చేయడం వల్ల మొక్కలకు పురుగు, చీడలు రాకుండా కాపాడుకోవచ్చు.ఇల్లు...పూల సరాగాల హరివిల్లుఇంటి ముందు పూలముక్కలు... పూలతీగలు... కుండీలలో పెరిగేవి కొన్ని, గోడమీదికి, తీగలాగా పైకి పాకేవి కొన్ని... వర్షం పడినప్పుడు, గాలి మంద్ర మంద్రంగా వీచేటప్పుడు పూలమొక్కలు, తీగలు మన ఇంటి ముందు, పైన వేలాడుతుంటే ఆ దృశ్యాన్ని చూసి పలవరించగలమే కాని వర్ణించలేం.